- ఇందిరమ్మ స్కీమ్‌ను సక్సెస్ చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కూడు గూడు గుడ్డ కోసం ‘గరీబీ హటావో’నినాదంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేదల గుండెల్లో కొలువయ్యారని, అలాంటి ఇందిరమ్మ పాలనలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను విజయవంతం చేయాలని అధికారులు, ఇంజనీర్లను, ఉద్యోగులను ఆదేశించారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్స్, వర్క్ ఇన్‌స్పెక్టర్ న్యూ ఇయర్ డైరీని మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏటా అర్హులైన పేదలకు దశల వారీగా ఇండ్లు ఇస్తామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షల మందికి ఇండ్లు ఇచ్చిన హౌసింగ్ శాఖను గత పదేండ్లగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి, ఆర్ అండ్ బీలో విలీనం చేసిందన్నారు. త్వరలో ఈ శాఖను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను మాతృశాఖకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇంజనీర్స్ వర్క్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, బొగ్గుల వెంకట రామిరెడ్డి, అసోసియేషన్ అడ్వైజర్ రవీందర్ రెడ్డితో పాటు అన్ని జిల్లాల నుంచి ఇంజనీర్లు, అధికారులు అటెండ్ అయ్యారు.